Advertise

Friday, 17 May 2013

Rajakota Rahasyam Telugu Movie Review in Telugu

0 comments

విడుదల తేదీ : 17 మే 2013
దర్శకుడు : త్యాగరాజన్
నిర్మాత : గోగినేని బాలకృష్ణ
సంగీతం : ‘మాస్ట్రో’ ఇళయరాజా
నటీనటులు : ప్రశాంత్, స్నేహ, పూజా చోప్రా, దేవీ…


శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్’ సినిమాతో తెలుగువారికి బాగా సుపరిచితుడైన ప్రశాంత్ గుర్తున్నాడా, అదే ప్రశాంత్ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన్న సినిమా ‘పొన్నార్ శంకర్’. ఈ సినిమా 2011 ఏప్రిల్ 9న తమిళంలో విడుదలై అక్కడ విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఇప్పుడు అదే సినిమాని సెన్సేషనల్ మూవీస్ బ్యానర్ వారు ‘రాజకోట రహస్యం’ అనే పేరుతో తెలుగులో డబ్ చేసారు. త్యాగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ రాజకోట రహస్యమేమిటో చూద్దాం..

కథ :

రఘునాథ వర్మ(నెపోలియన్) అనే రాజుకి కప్పం కడుతూ తమ రాజ్యాలను పరిపాలించుకుంటూ ఉంటారు మధుసూధన మహారాజు మరియు శేషేంద్ర వర్మ. శేషేంద్ర వర్మ రాజ్యం కోసం తన కొడుకైన వీరేంద్ర వర్మ(ప్రకాష్ రాజ్)ను మధుసూధన మహారాజు కుమార్తె అయిన శ్యామలా దేవి(కుష్బూ)కి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కానీ శ్యామలా దేవి తండ్రిని అన్నయ్య రాజ మహేంద్రని వ్యతిరేకించి తన బావ అయినటువంటి మదన మూర్తిని(జయరాం) పెళ్లి చేసుకొని సంపదను, రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అలా వదిలి వెళ్ళిన తనకు కవలలు జన్మిస్తారు. వారు పెరిగి పెద్ద వారైతే వారి చేతిలో రఘునాథ వర్మ ప్రాణానికి హాని ఉందని వాళ్ళని చంపేయమని వీరేంద్ర వర్మ సలహా ఇవ్వడంతో రాజన్న(రాజ్ కిరణ్) సాయంతో పిల్లల్ని చంపేస్తారు.

అక్కడే కథలో అసలైన ట్విస్ట్.. కట్ చేస్తే రాజన్న తన సొంత బిడ్డల్లా పెంచుకుంటున్న ప్రకాష్(ప్రశాంత్) – ఆకాష్(ప్రశాంత్) లకు యుద్ద విద్యల్లో పూర్తి శిక్షణ ఇస్తాడు. ఒకరోజు ఆ రాజ్యానికి రాజైన రాజ మహేంద్ర వర్మ కూతుళ్ళను వీరేంద్ర వర్మ బందిస్తాడు. ఆ రాజు వారిని విడిపించి తీసుకొస్తే తన కుమార్తెలైన ప్రియాంక(పూజా చోప్రా) – ప్రవల్లిక(దివ్య పరమేశ్వరన్) లకు ప్రకాష్ – ఆకాష్ లకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. అనుకున్నట్టుగానే వారిని విడిపించి తీసుకువచ్చిన ఆకాష్ – ప్రకాష్ లకు భాస్కరయ్య(నాజర్) ద్వారా వారి గతం తెలుస్తుంది. అప్పుడు వారు తమ రాజ్యం కోసం ఏమి చెయ్యాలో తెలుస్తుంది. ఆకాష్ – ప్రకాష్ లు తమ రాజ్యం కోసం రఘునాథ వర్మ సైన్యం తో పోరాడి గెలిచారా? లేదా? తన స్వార్ధం కోసం అందరి జీవితాలతో ఆడుకున్న వీరేంద్ర వర్మని చివరికి ఏం చేసారు? అసలు ఆకాష్ – ప్రకాష్ ల గతం ఏమిటి? అనేదే మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

ప్రకాష్ – ఆకాష్ లుగా ద్విపాత్రాభినయం చేసిన ప్రశాంత్ నటన చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు బాగా చేసాడు. సినిమాని చాలా వరకూ ప్రశాంత్ ఒక్కడే తన భుజాలపై వేసుకొని నడిపించాడు కానీ డైలాగ్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. పూజా చోప్రా, దివ్య పరమేశ్వరన్ లకు నటించడానికి పెద్దగా ఆస్కారం లేకపోయినా స్క్రీన్ మీద కనిపించినంతసేపు గ్లామర్ తో బాగానే ఆకట్టుకున్నారు. నెపోలియన్, ప్రకాష్ రాజ్, రాజారం, కుష్బూ, నాజర్, ప్రభులు తమకిచ్చిన పాత్రల పరిధిమేర నటించారు. రాజ్ కిరణ్ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసాడు.

సినిమాలో కనిపించే ప్రతి సెట్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త వేగంగా సాగుతుంది. ఇంటర్వల్ ముందు జరిగే యుద్ధం కాస్త గందర గోళంగా అనిపించినా హీరో చేసే ఫీట్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒకే ఒక్క పాటని చేలా బాగా షూట్ చేసారు, కొరియోగ్రఫీ సూపర్బ్.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అర్ధ భాగం సాగినంత వేగంగా సెకండాఫ్ సాగదు. సెకండాఫ్ మొత్తం కథ చెప్పాలనుకోవడంతో చివరి క్లైమాక్స్ ఫైట్ వరకూ సినిమా నత్త నడకలా సాగుతుంది. దానికి తోడు రెండు పాటలు వచ్చి ప్రేక్షకులకి ఇంకా చిరాకు తెప్పిస్తాయి. డైరెక్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ కి ముందు ప్రేక్షకుల్ని తారాస్థాయికి తీసుకెళ్ళినా యాక్షన్ సీక్వెన్స్ అయ్యేంతవరకు అదే ఉత్కంఠతని వారిలో కలిగించలేకపోయాడు. డైరెక్టర్ కత్తి యుద్దాలు, పోరాటాలు పెట్టాలనుకున్నప్పుడు వాటి మీద పట్టున్న ఫైట్ మాస్టర్స్ ని లేదా ఒక ఇద్దరు ముగ్గురు ఫైట్ మాస్టర్స్ ని పెట్టుకుని ఉంటే సినిమాకి బాగా హెల్ప్ అయ్యేది కానీ ఒక్కడినే పెట్టుకోవడం వల్ల అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి పూర్తి న్యాయం చెయ్యలేకపోయాడు.

రాసుకున్న కథలో చాలా లొసుగులు ఉన్నాయి. చాలా చోట్ల లాజిక్స్ లేవు. ఉదాహరణకి శ్యామలా దేవి పెళ్లి తండ్రి అంగీకారంతోనే జరుగుతుంది కానీ ఆ తర్వాత ఏమవుతుందో ఏమో నా కూతురు మోసం చేసిందని తన కూతుర్నే చంపాలని నిర్ణయించుకుంటాడు. అసలు అతనెందుకలా చేస్తున్నాడు అనేదానికి కారణం ఉండదు.ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. సినిమా మొత్తం మీదా నవ్వుకోవడానికి ఒక్క సీన్ ఒకే ఒక్క సీన్ అని బూతద్దం పెట్టి వెతికినా దొరకదు. దీన్ని బట్టి సినిమాలో ఎంటర్టైన్మెంట్ శూన్యం అని మీకు అర్థమైందని అనుకుంటా. స్నేహ లాంటి పెద్ద హీరోయిన్ సినిమాలో ఉన్నా ఒకడి రెండు సీన్లకి, నటీనటుల గ్రూప్ లో ఒకదానిగా మాత్రం పరిమితమయ్యింది. తను ఉన్న రెండు సీన్ల వల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగమూ లేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి మొట్టమొదటి మెయిన్ హైలైట్ ఆర్ట్ డిపార్ట్ మెంట్. ఆర్ట్ డైరెక్టర్ ముత్తిరాజ్ డిజైన్ చేసిన అద్భుతమైన సెట్స్ అందరి చేతా వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇక రెండవ హైలైట్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ. ముత్తిరాజ్ వేసిన సెట్స్ ని సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ అంతకన్నా అద్భుతంగా తెరపై చూపించాడు. వీరిద్దరూ లేకపోతే ఈ సినిమా ప్రేక్షకుడు ఎప్పటికీ చూడలేని సినిమాగా మిగిలిపోయేది. డా. కరుణానిధి అందించిన కథలో చాలా బొక్కలున్నాయి, వాటిని స్క్రీన్ ప్లే లో కవర్ చేసుకోకపోగా ఉన్నవాటిని ఇంకాస్త పెద్దవి చేసారు. డైరెక్టర్ త్యాగరాజన్ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టి తీసినా కొన్ని సీన్స్ ని మాత్రమే బాగా తియ్యగాలిగాడు. పూర్తి సినిమా విషయానికి వచ్చేసరికి జస్ట్ పాస్ మార్కులతో గట్టేక్కేసాడు.

మాస్ట్రో ఇళయరాజా అందించిన మూడు పాటలను పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని చాలా వరకూ నిలబెట్టాడు. గాల్లో లేపి కొట్టడానికి ఎక్కువగా ఇష్టపడే కనల్ కన్నన్ ఈ సినిమాకి కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మరీ సూపర్బ్ గా లేకపోయినా నిరుత్సాహమైతే కలిగించవు. తమిళ్ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు వెర్షన్లో చాలా అనవసరపు సీన్స్ కట్ చేసారు. కానీ ఎడిటర్ సెకండాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. విజువల్ ఎఫెక్ట్స్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఈ మండు వేసవిలో విడుదలైన ‘రాజకోట రహస్యం’ సినిమాలో రహస్యం ఏమీలేకపోయినా రాజకోటల విషయంలో మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. అద్భుతమైన రాజకోట సెట్స్, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ ఎపిసోడ్స్, ప్రశాంత్ నటన ఈ సినిమాకి ప్రధాన హైలైట్. స్లోగా సాగే సెకండాఫ్, అంతగా ఆకట్టుకొని స్క్రీన్ ప్లే, అంతంత మాత్రంగా అనిపించే డైరెక్షన్, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం బిగ్ మైనస్ పాయింట్స్. రాజుల కథలు, కోటలు, యుద్దాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మిగతా వారికి ‘రాజకోట రహస్యం’ పరవాలేదనిపిస్తుంది.

Leave a Reply

Labels

 
Movies Information © 2011 DheTemplate.com & Main Blogger. Supported by Makeityourring Diamond Engagement Rings

You can add link or short description here